
ఇంటర్నెట్‌డెస్క్: సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన చిత్రం ‘జాక్’ (Jack). వైష్ణవి చైతన్య కథానాయిక. ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత పూజా హెగ్డే (Pooja Hegde)ను అనుకున్నట్లు వస్తోన్న వార్తలపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధూ జొన్నలగడ్డ స్పందించారు. ఆయా వార్తల్లో నిజం లేదని అన్నారు. ఈ కథకు పూజాహెగ్డేను తీసుకోవాలనే ఆలోచన ఏమాత్రం లేదని.. మొదటి నుంచి తాము అనుకున్నది వైష్ణవి చైతన్య పేరేనని చెప్పారు. మరో ఇంటర్వ్యూలో ఆయన దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌తో క్రియేటివ్ డిఫరెన్సెస్ (సృజనాత్మక విభేదాలు) తలెత్తాయనే ప్రచారంపై మాట్లాడారు. సినిమా విషయంలో అలాంటివి సహజం అన్నారు.
‘‘క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తిన మాట వాస్తవమే. మేము సినిమా కోసమే కొట్టుకున్నాం. తీవ్రంగా చర్చించుకున్నాం. సినిమా అన్నాక ఇలాంటివి సహజం. అంతేకానీ, మేము ఏమాత్రం వ్యక్తిగత కారణాల వల్ల తిట్టుకోలేదు. సోషల్‌మీడియాలో పెట్టే ఒక చిన్న పోస్ట్ విషయంలోనే స్నేహితుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. అలాంటిది రెండున్నర గంటల సినిమా చేస్తున్నప్పుడు ఇలాంటివి ఉండటంలో తప్పు లేదు’’ అని సిద్ధూ జొన్నలగడ్డ చెప్పారు.
అనంతరం ఆయన ‘టిల్లు స్క్వేర్’ గురించి మాట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే, ఆ సమయానికి నాకు ‘టిల్లు స్క్వేర్’ చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే, ‘డీజే టిల్లు’ చేయడానికి నా వద్ద ఒక కథ ఉంది. ఆ ధైర్యంతోనే సినిమా చేశా. కానీ సీక్వెల్‌కు వచ్చేసరికి నా వద్ద కథ లేదు. కరోనా కారణంగా పార్ట్ 1కు రావాల్సిన గుర్తింపు ఒకింత తగ్గిందనే భావన మాత్రం మా టీమ్‌లో ఉండిపోయింది. కాబట్టి, మరోసారి ఇదే తరహా కథ చేసి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుందామని నిర్ణయించుకుని సుమారు రెండేళ్లపాటు శ్రమించి సీక్వెల్ చేశాం. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డబ్బులు బాగానే కలెక్ట్ చేసింది.
డబ్బులు కోసమే సినిమాలు చేయాలనుకుంటే టిల్లు తర్వాత నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. వాటికి అంగీకారం తెలిపితే నాకు పెద్ద మొత్తంలో డబ్బు అందేది. కానీ, నా ఫోకస్ మొత్తం ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలనే దానిపైనే ఉంది. అందుకే రెండేళ్లు శ్రమించి సినిమా చేశాం’’ అని వివరించారు. ‘జాక్’ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పారు. వైష్ణవి పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని.. ఆమెకు సంబంధించిన సీన్స్‌ను కావాలనే రివీల్ చేయలేదని తెలిపారు.