ఇంటర్నెట్‌డెస్క్: భార్య ఆర్తితో జయం రవి (Jayam Ravi) విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది నుంచి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. వీరి విడాకుల కేసు కోర్టులో ఉండగా తాజాగా రవి తన స్నేహితురాలు, గాయని కెనీషాతో (Keneeshaa) కలిసి తిరుమల వెళ్లడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఈనేపథ్యంలో ఆర్తి (Aarti) పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
ఇన్‌స్టాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆర్తి తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘నువ్వు ఇతరులను మోసం చేయొచ్చు. నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు. కానీ, దేవుడిని మోసం చేయలేవు’’ అని స్టోరీలో పోస్ట్ చేశారు. దీంతో ఆమె జయం రవిని ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టి ఉంటారని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల కూడా ఆమె పిల్లలను ఉద్దేశిస్తూ ఓ నోట్ షేర్ చేశారు. ‘ఉత్తమ తల్లిదండ్రులంటే వారెప్పుడూ పిల్లల కోసమే ఆలోచిస్తారు. ఎందుకంటే అమాయకులైన పిల్లలు అందరి ప్రేమకు అర్హులు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వారిని కాపాడుకోండి’’ అని రాసుకొచ్చారు.
వీరిద్దరూ విడాకులు ప్రకటించిన సమయంలో ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసుకున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉంది. తన భర్త నుంచి నెలకు రూ.40 లక్షల భరణం ఇప్పించాలని కోరుతూ ఆర్తి ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు.