ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రెండో సెమీఫైనల్ (SA vs NZ)లో దక్షిణాఫ్రికాకు న్యూజిలాండ్ జట్టు 363 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రెండో సెమీఫైనల్ (SA vs NZ)లో దక్షిణాఫ్రికాకు న్యూజిలాండ్ జట్టు 363 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 362 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర 108 (101), కేన్ విలియమ్సన్ 102 (94) సెంచరీలతో అదరగొట్టారు. మ్యాచ్ ఆఖర్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో ఫిలిప్స్ 49*(27) మెరుపు ఇన్సింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు, రబాడా రెండు వికెట్లు, ముల్డర్ ఒక వికెట్ తీశారు.
ఇన్నింగ్స్ ప్రారంభంలో న్యూజిలాండ్ ఓపెనర్లు విల్ యంగ్, రచిన్ రవీంద్ర ఆచితూచి ఆడారు. 7.5 ఓవర్‌లో 48 పరుగుల వద్ద కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్‌లో మార్‌క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి విల్ యంగ్ 21 (23) వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విలియమ్సన్.. రచిన్‌తో కలిసి క్రీజులో పాతుకుపోయాడు. ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 164 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 33.3 ఓవర్‌లో రబాడా బౌలింగ్‌లో కీపర్ క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి రవీంద్ర ఔటయ్యాడు. 91 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్న విలియమ్సన్.. 102 పరుగుల వద్ద వాన్ ముల్డర్ బౌలింగ్‌లో లుంగి ఎంగిడికి చిక్కాడు. మిచెల్ 49 (37) అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు. ఫిలిప్స్ 49*(27), బ్రేస్‌వెల్ 16 (12), లేథమ్ 4 (5), శాంట్నర్ 2*(1) పరుగులు చేశారు.