
ఇంటర్నెట్ డెస్క్: చిన్న చిత్రంగా విడుదలై రికార్డులు తిరగరాసింది ‘కొత్తలోక: చాప్టర్ 1’ (kotha lokah chapter 1). కేవలం మౌత్ టాక్‌తోనే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిందీ సినిమా. ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని అభిమానులు ఎదురుచూశారు. తాజాగా వారి ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ జియో హాట్‌స్టార్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 31 (kotha lokah ott release date) నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. తెలుగు, మలయాళం, తమిళ, హిందీతో పాటు బెంగాళీ, మరాఠీలలోనూ ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేసింది.
ఇంతకీ కథేంటంటే..
చంద్ర అలియాస్ నీలి (కల్యాణి ప్రియదర్శన్) అతీంద్రియ శక్తులు కలిగి ఉంటుంది. ఒక మిషన్‌లో ఆమె త్రుటిలో శత్రువుల నుంచి తప్పించుకుంటుంది. దీంతో చంద్ర స్వీడన్ నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యి తన గురించి ఎవరికీ తెలియకుండా ఒక కేఫ్‌లో పనిచేస్తూ ఉంటుంది. ఆమె పక్కింట్లో ఉండే సన్నీ (నస్లేన్) ఆమెతో స్నేహం పెంచుకుంటాడు. మరోవైపు ఇన్‌స్పెక్టర్ నాచియప్ప గౌడ (శాండి మాస్టర్), అతడి బాస్ మానవ అవయవాల అక్రమ రవాణా చేస్తుంటారు. అనుకోకుండా తారసపడిన చంద్రపై నాచియప్పకు అనుమానం కలుగుతుంది. మరి ఆ తర్వాత అతడు ఏం చేశాడు? అసలు చంద్ర ఎవరు..? ఆమెను చూసి సన్నీ ఎందుకు అంతగా భయపడ్డాడు? అనేది చిత్ర కథ.
కలెక్షన్ల వర్షం..
ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాదు, అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి మలయాళీ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. మోహన్‌లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఈ ఏడాది వచ్చిన ‘ఎల్2: ఎంపురాన్’ ఇప్పటివరకూ మలయాళంలో అత్యధిక వసూళ్లు (రూ.265.5 కోట్లు) రాబట్టిన చిత్రంగా ఉండేది. ఆ రికార్డును ‘కొత్తలోక’ బద్దలు కొట్టింది. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. విడుదలైన 40 రోజుల్లో రూ.300 కోట్లు (గ్రాస్) వసూలు (kotha lokah chapter 1 collection) చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.



