సినీ గాయని కల్పన తన ఇంట్లో అపస్మారక స్థితిలో ఉండటం కలకలం రేపింది. హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని విల్లాలో ఉంటున్న ఆమె మంగళవారం సాయంత్రం చెన్నైలో ఉన్న భర్తకు ఫోన్ చేసి అపస్మారక స్థితిలోకి వెళ్తున్నట్లు చెప్పింది.

ఈనాడు-హైదరాబాద్, కేపీహెచ్‌బీ, న్యూస్‌టుడే: సినీ గాయని కల్పన తన ఇంట్లో అపస్మారక స్థితిలో ఉండటం కలకలం రేపింది. హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని విల్లాలో ఉంటున్న ఆమె మంగళవారం సాయంత్రం చెన్నైలో ఉన్న భర్తకు ఫోన్ చేసి అపస్మారక స్థితిలోకి వెళ్తున్నట్లు చెప్పింది. ఆయన వెంటనే కాలనీ సంఘం ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు చెప్పారు. వారొచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే కల్పన అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే సమీప హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. కేపీహెచ్‌బీ ఠాణా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి 9 గంటల తర్వాత భర్త ప్రసాద్ ప్రభాకర్ ఆసుపత్రికి చేరుకోగా.. ఆయన నుంచి వివరాలు సేకరించారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పినట్లు సమాచారం. మరిన్ని వివరాల సేకరణకు ఆయనను పోలీసులు ఠాణాకు తీసుకెళ్లారు. ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
ప్రశాంతత, నిద్ర కోసం మాత్రలు!
తమిళనాడుకు చెందిన కల్పన(45) 2010లో భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఓ కుమార్తె(19) ఉంది. 2018లో కేరళకు చెందిన వ్యాపారి ప్రసాద్ ప్రభాకర్‌తో రెండో వివాహం జరిగింది. వీరిద్దరూ ఐదేళ్లుగా కేపీహెచ్‌బీలోని వర్టెక్స్ ప్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలోని విల్లాలో నివాసముంటున్నారు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనానికి, నిద్ర కోసం కల్పన మాత్రలు తీసుకుంటుంటారు. వాటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పనకు, ఆమె కుమార్తెకు మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.



